స్వీట్లు ఎక్కువగా తింటున్నారా?

స్వీట్లు ఎక్కువగా తినే వారి మెదడు పనితీరు తగ్గుతుందట. స్వీట్లు తినడంతో మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుందని ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ పరిశోధకులు వెల్లడించారు. తీపి తినడంతో మెదడులోని హిప్పోకాంపస్ దెబ్బతిని గుర్తించుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుందట. యువకుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్పారు. ఎక్కువగా స్వీట్లు, కూల్ డ్రింక్‌లు తాగొద్దని హెచ్చరిస్తున్నారు.

సిజేరియన్‌ శిశువుల్లో రోగనిరోధక శక్తి తక్కువ..

సాధారణ ప్రసవంతో పోల్చితే ఆపరేషన్ ద్వారా పుట్టిన శిశువులు ఎక్కువగా అనారోగ్యాల బారిన పడతారట. సిజేరియన్ సమయంలో, ఆ తర్వాతి కాలంలో ఉపయోగించే యాంటీబయోటిక్‌ మందులు.. చిన్నారుల రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయట. అటు డబ్బా పాలతో పెరిగే శిశువులల్లోనూ రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుందట. దీంతో వీరు భవిష్యత్‌లో పలు అనారోగ్యాలతో ఇబ్బంది పడతారని తాజా అధ్యయనం వెల్లడించింది.

యుక్త వయసులో స్థూలకాయంతో గుండెకు ముప్పు..

యుక్త వయసులో (కౌమరం) స్థూలకాయంతో బాధపడేవారు భవిష్యత్తులో గుండెజబ్బుల బారినపడే ప్రమాదం ఉందట. వయసు పైబడుతున్న కొద్దీ సన్నబడినా.. ఈ ముప్పు తప్పడం లేదని స్వీడన్‌ పరిశోధకులు తెలిపారు. వయసు పెరుగుతుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోందట. కాగా రక్తంలో యాంటీబాడీల సంఖ్య ఎక్కువగా ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువని మరో అధ్యయనంలో తేలింది.

కృత్రిమ తీపితో అనర్థాలు..

కృత్రిమ స్వీట్నర్స్ వాడొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటితో ఆరోగ్యం దెబ్బతింటుందట. లావుగా ఉన్నవారు ఆర్టిఫిషియల్ స్వీట్నర్‌ను అధిక మొత్తంలో వినియోగిస్తుంటారని.. దీని వల్ల వారి శరీరంలో గ్లూకోజ్ మేనేజ్ మెంట్ సరిగా ఉండదట. అటు ఈ మధ్య కాలంలో నకిలీ స్వీట్నర్స్ మార్కెట్‌లో చలామణీ అవుతున్నాయని.. అవి వాడిన గర్భిణులు ఊబకాయులైన పిల్లలకు జన్మనిస్తారని పరిశోధనలో తేలింది.

బ్రేక్‌ఫాస్ట్ విషయంలో అశ్రద్ధ వద్దు..

బ్రేక్‌ఫాస్ట్ విషయంలో అశ్రద్ధ ఆరోగ్యానికి హానికరమట. ఎక్కువ రోజులు ఉదయంపూట అల్పాహారం తీసుకోకుండా ఉంటే డయాబెటిస్ బారిన పడతారని ఓ అధ్యయనంలో తేలింది. టిఫిన్ చేయనివారికి ఆ రోజంతా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. డిన్నర్‌కు, బ్రేక్ ఫాస్టుకి ఎక్కువ విరామ సమయం ఉండడం వల్ల గ్లూకోజ్ స్థాయులు సాధారణ స్థితిలోకి రావాలంటే తప్పనిసరిగా తినాల్సిందేనని సూచించింది.

విటమిన్లు లోపించినా మైగ్రేన్ వస్తుందట..

శరీరానికి సరిపడా విటమిన్లు అందకపోతే మైగ్రేన్ తలనొప్పి వచ్చే ప్రమాదం ఉందట. డీ, రైబోప్లేవిన్, కోఎంజైమ్ వంటి విటమిన్ల లోపంతో శరీరంలో కణాల వృద్ధి సరిగా ఉండదని, దీంతో తలనొప్పి వచ్చే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. దీన్ని బారినపడకుండ ఉండేందుకు విటమిన్లు పుష్కళంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

పెద్ద బాటిల్‌లో పాలు పడుతున్నారా?

అప్పుడే బిడ్డలకు పెద్ద పెద్ద డబ్బాలలో పాలు తాగించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే చిన్నారులు లావు అవుతారని అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్శిటీ వైద్యులు తెలిపారు. 45శాతం మంది తల్లిదండ్రులు 60z బాటిళ్లతో తమ పిల్లలకు పాలు తాగిస్తున్నారట. చిన్న బాటిల్‌లోని పాలు తాగిన పిల్లలు 6 నెలల్లో 7.8 కేజీలు బరువు పెరగగా, పెద్ద బాటిల్‌లోని పాలు తాగిన వారు 8.2 కేజీల బరువు పెరిగారట.

ఎక్కువ చదివితే బ్రెయిన్ ట్యూమర్..

బాగా చదువుకునే విద్యార్థులు తీవ్ర కష్టాల్లో ఉన్నారట. యూనివర్శిటీ స్థాయి విద్యార్ధుల్లో చాలా మంది బ్రెయిన్ ట్యూమర్‌తో ఇబ్బంది పడుతున్నారని లండన్‌కు చెందిన పరిశోధకులు తేల్చారు. బాగా చదివే విద్యార్ధుల్లో గ్లియోమాస్ అధికంగా వృద్ధి చెంది.. బ్రెయిన్ ట్యూమర్‌కు దారి తీస్తుందట. యూనివర్శిటీ విద్యార్ధుల్లో 19 శాతం మగవారు, 23శాతం ఆడవాళ్లు ఈ సమస్యల బారిన పడటంతో పాటు ఎక్కువగా డాక్టర్లను కలుస్తున్నారట.

డెంగ్యూ దోమలే జికాకూ కారణం!

డెంగ్యూను వ్యాప్తి చేసే దోమలే జికా వైరస్‌ను కూడా వ్యాప్తి చేస్తున్నాయట. జికా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనే క్రమంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు ఇది తేల్చారు. గతంలో డెంగ్యూ వైరస్ బారిన పడిన వారిలో జికా వైరస్ ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తున్నట్లు గుర్తించామన్నారు. డెంగ్యూకు ఉపయోగించే వ్యాక్సిన్.. జికా వైరస్‌ను అరికట్టడంలో కూడా తోడ్పడే అవకాశముందనే దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు.

ఆ సమయంలో జాగ్రత్తగా లేకపోతే అంతే!

గర్భిణీ స్త్రీలు సరైన ఆహారం తీసుకోనట్లయితే పుట్టబోయే పిల్లలతో పాటు రాబోయే 3తరాలకు ఆరోగ్య సమస్యలు తప్పవట. ప్రెగ్నెన్సీ సమయంలో ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ కొలెస్ట్రాల్‌తో కూడిన ఆహారాన్ని తీసుకున్న వారి సంతానంలో 3తరాల పాటు స్థూలకాయత్వం ముప్పు ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. డయాబెటిస్, హృదయ సంబంధ సమస్యలపై ఇది అత్యధికంగా ప్రభావం చూపుతుందని.. ఆహారం విషయంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు హెచ్చరించారు.


Some Other Useful Yoga Aasans


google ads